China: భారత్-చైనా మధ్య రికార్డు స్థాయిలో సుదీర్ఘ భేటీ.. 15 గంటలపాటు చర్చ
- భారత భూభాగంలోని చుషూల్ వద్ద చర్చలు
- నిన్న ఉదయం 11 గంటలకు మొదలై.. ఈ తెల్లవారుజామున 2 గంటలకు ముగిసిన చర్చలు
- వెల్లడి కాని చర్చల సారాంశం
గల్వాన్ లోయ ఘటన అనంతరం భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు నాలుగు సార్లు కమాండర్ స్థాయిలో చర్చలు జరగ్గా, నిన్న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మొదలయ్యాయి. నిన్న ఉదయం 11 గంటలకు ఎల్‌వోసీ వెంబడి భారత భూభాగంలోని చుషూల్‌లో మొదలైన చర్చలు 15 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగి ఈ తెల్లవారుజామున 2 గంటలకు ముగిశాయి.
ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘ సమయం చర్చలు జరగడం ఇదే తొలిసారి. అయితే, ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంతోపాటు బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల తర్వాత గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి చైనా సైన్యం వెనక్కి మళ్లింది. అలాగే, ఫింగర్-4, పాంగాంగ్ సరస్సుల వద్ద సైనికులను కుదించింది.