Raghurama Krishnaraju: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు లేఖ
- లాక్ డౌన్ తో తీవ్ర కష్టాల్లో భవన నిర్మాణ కార్మికులు
- పేర్ల నమోదు వేగవంతం చేయాలన్న రఘురామకృష్ణరాజు
- ఒక్కో కార్మికుడికి రూ.5 వేలు అందించాలని విజ్ఞప్తి
కొంతకాలంగా వైసీపీ అధినాయకత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. అయితే పార్టీపరమైన విషయాలు కాకుండా, రాష్ట్రంలో అష్టకష్టాలపాలవుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిందని, కొన్ని నెలలుగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.
"కరోనా కారణంగా తీవ్ర సంక్షోభం ఏర్పడిందని మీరే చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నగదు, ఉచిత రేషన్ అందిస్తున్నాయి. కానీ అంతకంటే చేయాల్సింది ఎక్కువే ఉందనిపిస్తోంది. మా పశ్చిమ గోదావరి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నుంచి నాకు వినతులు వస్తున్నాయి.
మన ప్రభుత్వం 20,64,379 మంది కార్మికుల పేర్లను ఆధార్ తో లింకు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో ఆధార్ తో లింక్ చేసింది 10,66,265 మంది పేర్లు మాత్రమే. వచ్చే నెల నాటికి మిగతా వారి పేర్లు కూడా ఆధార్ తో అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే... మిగతా కార్మికుల పేర్లను కూడా ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసేలా గ్రామ, వార్డు వలంటీర్లకు ఆదేశాలు పంపండి.
అంతేకాదు, 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్ల నుంచి లేబర్ వెల్ఫేర్ ఫండ్ రూపంలో రూ.1364 కోట్లు వసూలు చేసినా, ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.330 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.1000 కోట్ల నిధిని ఇప్పుడు కార్మికులకు అందించండి. ఒక్కొక్క కార్మికుడికి రూ.5 వేల చొప్పున సాయం అందించండి" అంటూ రఘురామకృష్ణరాజు కోరారు.