Pitani Satyanarayana: మాజీ మంత్రి పితాని తనయుడికి హైకోర్టులో చుక్కెదురు
- ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
- తండ్రి అధికారాన్ని వెంకట సురేశ్ దుర్వినియోగం చేయలేదన్న లాయర్
- రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారని వాదన
ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేశ్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వెంకట సురేశ్, మాజీ పీఎస్ మురళీమోహన్ లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు.
పిటిషనర్ల తరపున అడ్వొకేట్ చల్లా అజయ్ కుమార్ వాదిస్తూ... రాజకీయ కక్షతోనే వీరిని కేసులో ఇరికించారని అన్నారు. తన తండ్రి పదవిని వెంకట సురేశ్ ఏనాడూ దుర్వినియోగం చేయలేదని చెప్పారు. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనతో ఏసీబీ తరపు న్యాయవాది విభేదించారు. ఇరు వైపుల వాదనలను విన్న జడ్జి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు.