Chandrababu: తిరుపతిలో వీడియో జర్నలిస్టు కరోనాతో మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్
- తిరుపతిలో కరోనాతో కెమెరామన్ పార్థసారథి మృతి
- మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాడన్న చంద్రబాబు
- మీడియా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ సూచన
తిరుపతి నగరంలో ఓ న్యూస్ చానల్ తరఫున వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న పార్థసారథి అనే సీనియర్ కెమెరామన్ కరోనాతో కన్నుమూశాడు. ఏపీ మీడియాలో ఇదే తొలి కరోనా మరణం కావడంతో పాత్రికేయ వర్గాల్లో విషాదం నెలకొంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ పార్థసారథి మరణించడం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. పార్థసారథి ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తా కథనాలను తీసుకువస్తూ మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించారని కీర్తించారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వివరించారు.
నారా లోకేశ్ స్పందిస్తూ, పార్థసారథి మరణం నేపథ్యంలో మీడియా సిబ్బంది అప్రమత్తం కావాలని, కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీరు జాగ్రత్తగా ఉండడమే కాకుండా మీ కుటుంబాలను కూడా సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.