Corona Virus: రాజ్ భవన్ లో కరోనా భయం... తనకు నెగెటివ్ వచ్చిందన్న గవర్నర్ తమిళిసై
- భద్రతా సిబ్బందిలో 28 మందికి పాజిటివ్
- రాజ్ భవన్ సిబ్బందిలో 10 మందికి కరోనా
- వారి కుటుంబ సభ్యులకూ వైరస్ నిర్ధారణ
తెలంగాణ రాజ్ భవన్ లో కరోనా కలకలం రేగింది. భద్రతా విధులు నిర్వర్తిస్తున్న 28 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే తనకు నెగెటివ్ వచ్చిందని ఆమె వెల్లడించారు. అటు రాజ్ భవన్ లో పనిచేసే సిబ్బందిలోనూ 10 మందికి కరోనా నిర్ధారణ కావడం, వారి కుటుంబ సభ్యుల్లోనూ మరో 10 మందికి వైరస్ సోకడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో పనిచేసే మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 347 మందికి నెగెటివ్ వచ్చింది. కరోనా సోకిన వారికి ఎస్సార్ నగర్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై ట్వీట్ చేస్తూ, రెడ్ జోన్లలో ఉన్నవారు, కరోనా బాధితులను కలిసినవారు ముందుగా పరీక్షలు చేయించుకునేందుకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. అంతేకాదు, 4టీ లను తప్పకుండా పాటించాలని సూచించారు. టెస్ట్ (పరీక్ష), ట్రేస్ (ఫలితం), ట్రీట్ (చికిత్స), టీచ్ (అనుభవాలను ఇతరులకు బోధించడం) అంటూ వివరించారు.