Amitabh Bachchan: అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు సోకిన మహమ్మారి వైరస్
- నాలుగు రోజుల క్రితం పరీక్షలు
- పాజిటివ్ రాగానే ముంబయి నానావతి ఆసుపత్రికి తరలింపు
- అభిమానులు ఆందోళన చెందవద్దన్న బిగ్ బీ
బాలీవుడ్ నటుడు, కోట్లాది మంది ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా మహమ్మారి సోకింది. నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా, నిన్న వచ్చిన ఆ పరీక్ష ఫలితంలో పాజిటివ్ అని తేలింది. దీంతో అమితాబ్ ను శనివారం రాత్రి కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబయిలోని నానావతి హాస్పిటల్ లో చేర్చారు. తనకు కరోనా సోకిందని తెలియగానే, గడచిన 10 రోజుల్లో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ ఖాతాలో అమితాబ్ వెల్లడించారు. మరోవైపు ఆయన ఇంట్లోని కుటుంబీకులందరి నమూనాలనూ వైద్యులు సేకరించి, పరీక్షలకు పంపగా అభిషేక్ బచ్చన్ కు కూడా పాజిటివ్ వచ్చింది.
అమితాబ్ భార్య జయాబచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్ లకు నెగటివ్ వచ్చింది. మిగతా కుటుంబీకుల రిపోర్టులు వెల్లడికావాల్సి వుంది. అమితాబ్ కరోనా నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రముఖులు ట్వీట్ల ద్వారా కోరుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "అమితాబ్ ఓ యోధుడు... ఆయన త్వరగా కోలుకుని బయటకు వస్తారు" అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సచిన్, యువరాజ్ తదితరులు ట్వీట్ చేశారు. ఆయనకు కరోనా సోకడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున సైతం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.