Pune: చేజారుతున్న పరిస్థితి.. పూణెలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్

Full Lockdown In Pune From July 13 to 23
  • పూణె పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజు 1,803 కేసులు
  • జిల్లాలో 974కు పెరిగిన కరోనా మరణాలు
  • ఈనెల 13 నుంచి ఫుల్ లాక్ డౌన్
మహారాష్ట్రలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ముంబై తర్వాత రాష్ట్రానికి ఆర్థికంగా బలమైన నగరంగా ఉన్న పూణెలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 13 నుంచి 23వ తేదీ వరకు పూణెలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించబోతున్నట్టు ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. కేవలం పాల దుకాణాలు, ఫార్మసీలు, ఆసుపత్రులు, ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. కరోనా లింక్ ను తెంచే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కు సంబంధించిన పూర్తి ఆర్డర్ ను విడుదల చేస్తామని పూణె డివిజనల్ కమిషనర్ దీపక్ తెలిపారు.

పూణెతో పాటు పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే 1,803 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 34,399 కేసులు నమోదయ్యాయి. పూణె జిల్లాలో ఇప్పటి వరకు 974 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,000 దాటాయి. ఇదే సమయంలో మరణాలు 219కి చేరుకున్నాయి.
Pune
Lockdown

More Telugu News