Corona Virus: ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ టార్గెట్ పై... కేంద్రం కీలక ప్రకటన!
- వ్యాక్సిన్ కు డెడ్ లైన్ పై తొందర లేదు
- సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో రాజీ పడబోము
- వెల్లడించిన ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి
గత నెలాఖరులో కరోనా వైరస్ కు దేశవాళీ వ్యాక్సిన్ ను ఆగస్టు 15న విడుదల చేస్తామని, ప్రభుత్వ రంగ ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వచ్చిన వేళ, కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి స్పందించింది. "అన్ని క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయితేనే ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని ఆరోగ్య శాఖలో ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్ భూషణ్ వెల్లడించారు. "డీజీ - ఐసీఎంఆర్ లేఖలో లేని అంశాలను ప్రస్తావించవద్దు. అది కేవలం అంచనా తేదీ మాత్రమే. ప్రజల భద్రత విషయంలో ఎన్నడూ రాజీ పడాలని భావించ లేదు" అని ఆయన అన్నారు.
కాగా, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఫాస్ట్ ట్రాక్ తో పూర్తి చేసి, ఆగస్టు 15 నాటికి ట్రయల్స్ పూర్తి చేసి, వ్యాక్సిన్ ను విడుదల చేసేలా చూడాలంటూ, పలు మెడికల్ కాలేజీలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఎంతో సమయం పడుతుందని, దీని విడుదలకు తేదీలను నిర్ణయించి, తొందరపడటం ఏంటని విమర్శలు వచ్చాయి.
అయితే, రెండు వ్యాక్సిన్ లకు ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని ఇచ్చామని, వాటి ఫలితాలను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్ పై ఓ తుది నిర్ణయానికి వస్తామని రాజేశ్ భూషణ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తరువాత మాత్రమే వ్యాక్సిన్ బయటకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.