Raghuram Rajan: భారత స్టాక్ మార్కెట్ ను నమ్మలేం... పీఎస్యూ వాటాలను అమ్మేసుకోవాలని కేంద్రానికి రఘురామ్ రాజన్ సలహా!

Raghuram Rajan Advice to Indian Government

  • లాక్ డౌన్ సమయంలో ఏర్పాట్లు చేసుండాలి
  • కరోనా విస్తరిస్తుంటే, మార్కెట్ అనిశ్చితి కూడా పెరుగుతోంది
  • కొత్త కేసుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి
  • ఓ ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఊగిసలాట ధోరణిలో ఉందని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించాలని భావిస్తే, ప్రభుత్వం ఈ లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకుని ఉండాల్సిందని రిజర్వ్ బ్యాంక్ మాజీ చైర్మన్, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ వెల్లడించారు. ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోయి, ప్రస్తుతం టాప్-3 పొజిషన్ కు చేరుకున్న వేళ, ఓ టీవీ చానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అంతే స్థాయిలో మార్కెట్ అనిశ్చితి కూడా పెరుగుతూ ఉందని ఆయన అన్నారు.

"కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కేసుల సంఖ్యను తగ్గించాలి. అప్పటివరకూ మనం విశ్రాంతి తీసుకోరాదు. కరోనా కర్వ్ ను కిందకు తీసుకుని రావాలి. కొత్త కేసుల సంఖ్యను తగ్గించాలంటే, టెస్టులను పెంచడం, ట్రాకింగ్, కంటెయినింగ్ ద్వారానే ఇది సాధ్యం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో మార్కెట్ లాభాల్లో నడుస్తూ ఉండటాన్ని ప్రస్తావించిన ఆయన, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్ముకునేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ కొనసాగిన ఈ నాలుగు నెలల సమయాన్ని ప్రభుత్వం వినియోగించుకుని, పీఎస్యూల్లో వాటాలను విక్రయించేందుకు మార్గాన్ని సుగమం చేసుకుని ఉండాల్సిందని అన్నారు.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ను నమ్మలేమని, ఏ క్షణమైనా సూచీలు కిందకు దిగి రావచ్చని హెచ్చరించిన ఆయన, ఈ సమయంలోనే వాటాలను ఎందుకు విక్రయించడం లేదని ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్ మరింతగా పెరుగుతుందన్న ఆలోచనలో ఉన్నారా? అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరించాలని భావించివుంటే, అందుకు తగిన ఏర్పాట్లను ఇప్పటికే చేసుండాల్సిందని, దీని వల్ల ప్రభుత్వ లక్ష్యాలు కూడా నెరవేరి వుండేవని అన్నారు.

కరోనా వైరస్ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోనే అధికంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, కేసుల సంఖ్యను తగ్గించే విషయంలో వియత్నాం వంటి పేద దేశాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చేందుకు భారత శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని అభినందించిన ఆయన, మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లను అభినందించారు. అయితే, కేసుల సంఖ్య తగ్గింపు దారిలో వెళ్లినప్పుడు మాత్రమే వారి శ్రమకు ఫలితం దక్కినట్టని అన్నారు.

  • Loading...

More Telugu News