KTR: హైదరాబాద్ నగర రోడ్లకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసిన మంత్రి కేటీఆర్
- నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించండి
- నిర్మించాల్సిన, విస్తరించాల్సిన రోడ్లను గుర్తించండి
- 100 ఫీట్ల రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచాలి
హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి... ప్రతి జోన్లో ఇప్పుడు ఉన్న రోడ్లతో పాటు భవిష్యత్తులో నిర్మించాల్సిన, విస్తరించాల్సిన వాటిని గుర్తించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికను అందించాలని చెప్పారు. నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులను ఈరోజు ఆయన సమీక్షించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, నిర్మాణం జరగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నివేదికలో భవిష్యత్తులో ఏర్పడే జంక్షన్లు, బస్ బేలు, టాయిలెట్ల ప్రతిపాదనలు కూడా ఉండాలని ఆదేశించారు. నగరంలో ఉన్న ప్రతి 100 ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచాలని చెప్పారు.
మరోవైపు, యూఎస్ ఐబీసీ ఇన్వెస్ట్ మెంట్ వెబినార్ లో కూడా ఈరోజు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ కంపెనీల అధినేతలతో ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభ సమయంలో కూడా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటోందని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ కు బలమైన వ్యవస్థ ఉందని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాలు హైదరాబాద్ కంపెనీల ఔషధాలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.