Talasani: ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదు... లోపల పడేస్తాం!: విపక్ష నేతలకు తలసాని వార్నింగ్

Talasani warns opposition party leaders
  • సచివాలయం కూల్చివేతను ప్రశ్నించిన విపక్షాలు
  • మీకేంటి ఇబ్బంది అంటూ ప్రశ్నించిన తలసాని
  • ఎవరెంత గగ్గోలు పెట్టినా సచివాలయం కట్టి తీరుతామని స్పష్టీకరణ
తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించేందుకు పాత సచివాలయం కూల్చడాన్ని విపక్షాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. కరోనా నివారణ చర్యల గురించి పట్టించుకోకుండా, కూల్చివేతలపై దృష్టి పెడుతోందంటూ మండిపడుతున్నాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

కరోనా సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమమైనా ఆపిందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. కొత్త సచివాలయం కడితే వచ్చే ఇబ్బంది ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ నేతలకు సెక్షన్-8 ఆలోచన రావడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు, లోపల పడేస్తాం అంటూ హెచ్చరించారు.

తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని తెలిపారు. కరోనాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మోదీని ప్రశ్నించాలని తలసాని సూచించారు. పైసా ఇవ్వకుండా బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా సచివాలయం కట్టి తీరుతాం అంటూ తలసాని స్పష్టం చేశారు.
Talasani
Congress
BJP
Secretariat
Telangana

More Telugu News