CBSE: విద్యార్థులపై భారం పడకుండా... 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ
- దేశంలో కరోనా తీవ్రం
- ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సిలబస్ తగ్గింపు
- 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతుండడంతో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. తాజాగా సీబీఎస్ఈ కూడా 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ ను కుదిస్తున్నామని వెల్లడించింది.
ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపింది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అయితే, సిలబస్ కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు.