Jagan: ఇళ్ల పట్టాల విషయంలో దురదృష్టవశాత్తు టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లారు: సీఎం జగన్
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
- ఇళ్ల పట్టాల విషయంలో మంచి ఆలోచనతో పనిచేస్తున్నామని వెల్లడి
- ధర్మమే గెలుస్తుందని ధీమా
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల పట్టాల అంశంలో అంతా సిద్ధమైన తరుణంలో దురదృష్టవశాత్తు టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేసుల విచారణ సాధ్యం కాలేదని పేర్కొన్నారు. అయితే, పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీంకోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
డి-పట్టాల రూపంలో ఇప్పటికిప్పుడైనా పేదలకు పట్టాలు ఇవ్వొచ్చని, కానీ పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టవుతుందన్న ఉద్దేశంతో ఆగస్టు 15కు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేశామని వివరించారు. మంచి ఆలోచనతో పనిచేస్తున్నందున ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.