India: భారత్-చైనా సరిహద్దుల వద్ద భారత యుద్ధ విమానాల నైట్ ఆపరేషన్స్.. వీడియో ఇదిగో
- తూర్పు గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చర్యలు
- ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయిన చైనా ఆర్మీ
- చైనా మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడకుండా భారత్ అప్రమత్తం
తూర్పు గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ దీటుగా స్పందించడంతో చైనా ఎట్టకేలకు వెనక్కు తగ్గి, నిన్న దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయింది. దశల వారీగా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నాయి.
అయితే, శాంతి కోసం చర్చలు జరుపుతూనే దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనాను నమ్మే పరిస్థితి లేదు. చైనా బలగాలు నిజంగానే వెనక్కి వెళ్లిపోయాయా? అన్న అంశాన్ని భారత్ ఎప్పటికప్పుడు నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో గత రాత్రి భారత్-చైనా సరిహద్దుల వద్ద భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 యుద్ధ విమానం చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అలాగే, భారత్-చైనా సరిహద్దులోని ఎయిర్‌బేస్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన ఆపాచీ హెలికాప్టర్లు నైట్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
కాగా, ఇటీవల ఘర్షణ నెలకొన్న ప్రాంతం నుంచి భారత్-చైనా తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నాయి. గాల్వన్, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికులను వెనక్కి పంపాలని ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.