Roposo: రోపోసో... టాప్ లెవల్లో ట్రెండింగ్ అవుతోంది!
- టిక్ టాక్ పై కేంద్రం నిషేధం
- దేశీయ యాప్ లకు పెరిగిన ఆదరణ
- గూగుల్ ప్లే స్టోర్ ట్రెండింగ్స్ లో రోపోసో యాప్
వీడియో షేరింగ్ యాప్ లలో నిన్నటివరకు రారాజుగా వెలిగిన టిక్ టాక్ పై కేంద్రం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. చైనాతో ఉద్రిక్తతల కారణంగా ఆ దేశానికి చెందిన యాప్ లపై కొరడా ఝుళిపించింది. ముఖ్యంగా టిక్ టాక్ భారత్ లో అందుబాటులో లేకపోవడంతో దేశీయ యాప్ లకు వరంగా మారింది. మన దేశంలో రూపొందిన వీడియో షేరింగ్ యాప్ లు ఇప్పుడు లక్షల్లో వస్తున్న డౌన్ లోడ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అలాంటి యాప్ లలో రోపోసో యాప్ టాప్ లో ఉంది. ఇది కూడా సోషల్ వీడియో షేరింగ్ యాప్.
టిక్ టాక్ పై నిషేధం నేపథ్యంలో యువత దృష్టి రోపోసోపై పడింది. టిక్ టాక్ పై బ్యాన్ అనంతరం కేవలం 48 గంటల వ్యవధిలో దీన్ని 22 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న యాప్ లలో ఇది కూడా స్థానం దక్కించుకుంది. గత కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోపోసో యాప్ 12 భాషల్లో అందుబాటులో ఉంది. ఆరేళ్ల కిందట వచ్చిన ఈ యాప్ కు ఇన్నాళ్లకు కాలం కలిసొచ్చిందని చెప్పాలి.