RGV: 'మర్డర్' సినిమాపై అమృత మామ పెట్టిన కేసుపై రామ్ గోపాల్ వర్మ స్పందన
- ఈ సినిమా ద్వారా ఎవరి ప్రతిష్టనూ దిగజార్చాలనుకోవట్లేదు
- ప్రజలు చర్చించుకుంటోన్న విషయం ఆధారంగా నా క్రియేటివ్ వర్క్
- ఓ పౌరుడిగా నేను చట్టాన్ని గౌరవిస్తాను
- నా హక్కుల రక్షణకు న్యాయపరంగా ముందుకు వెళ్తాను
మారుతి రాసిన అమృతప్రణయ గాథ అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' పేరిట సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా సినిమా తీస్తున్నారన్న విషయం తెలిసిందే. దీంతో నిన్న అమృత మామయ్య బాలస్వామి ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేసి, ఈ సినిమా తన కొడుకు హత్య కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొనగా వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. దీనిపై ఆర్జీవీ స్పందించారు.
'ఈ సినిమా ద్వారా ఎవరి ప్రతిష్టనూ దిగజార్చాలన్నది నా ఉద్దేశం కాదని నేను ఇప్పటికే ప్రత్యేకంగా తెలిపాను. ప్రజలు చర్చించుకుంటోన్న విషయం ఆధారంగా నా క్రియేటివ్ వర్క్ కొనసాగుతోంది. అయినప్పటికీ, ఓ పౌరుడిగా నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నా ప్రాథమిక హక్కులను రక్షించుకోవడానికి నేను కూడా న్యాయపరంగా ముందుకు వెళ్తాను' అని ప్రకటించారు. తన న్యాయవాదులు ఈ విషయంపై సమాధానం చెబుతారని మరో ట్వీట్‌లో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో అమృత పాత్రధారి తన కుమారుడిని ఎత్తుకున్న పోస్టర్‌ను వర్మ పోస్ట్ చేశారు.