India: కరాచీ ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం అంటూ పాక్ ఆరోపణ... కొట్టిపారేసిన భారత్
- కరాచీ స్టాక్ ఎక్చేంజిపై ఉగ్రదాడి
- భారత్ పై ఆరోపణలు చేసిన పాక్ విదేశాంగ మంత్రి
- పాక్ వ్యాఖ్యలు అసంబద్ధం అంటూ బదులిచ్చిన భారత్
పాకిస్థాన్ లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని స్టాక్ ఎక్చేంజి భవనంపై దాడికి దిగిన నలుగురు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు నలుగుర్ని పొట్టనబెట్టుకున్నారు. ఆపై భద్రతా బలగాల కాల్పుల్లో వీరు కూడా హతమయ్యారు. అయితే, ఈ ఉగ్రదాడి వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ పాక్ ఆరోపణలు చేసింది. భారత ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నామంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి వ్యాఖ్యానించారు.
దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ బదులిచ్చారు. పాకిస్థాన్ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయంటూ కొట్టిపారేశారు. దేశీయంగా ఉన్న సమస్యలను పొరుగు దేశంపైకి నెట్టడం సరికాదని పాకిస్థాన్ కు హితవు పలికారు. "ఉగ్రవాదంపై మీ వైఖరి ఇదేనా? అని పాక్ ను ప్రశ్నిస్తాం. ప్రపంచ ఉగ్రవాది లాడెన్ ను అమరవీరుడని కొనియాడిన పాక్ ప్రధాని వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ నిలదీస్తాం" అని పేర్కొన్నారు.