Arrest: తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో నలుగురు పోలీసుల అరెస్ట్, 302 సెక్షన్ కింద కేసు నమోదు!
- కలకలం రేపిన తండ్రీ కొడుకుల మృతి
- విచారణను సీబీఐకి అప్పగించిన సీఎం పళనిస్వామి
- విచారిస్తున్న 12 ప్రత్యేక టీమ్ లు
తమిళనాడులోని తూత్తుకుడి (టుటికోరిన్) ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో నలుగురు పోలీసులను సీబీ-సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ లను పోలీసులు చిత్రహింసలు పెట్టి, వారి మరణానికి కారణమయ్యారనడానికి ప్రాథమిక సాక్ష్యాలున్నాయని అధికారులు వెల్లడించారు.
లాక్ డౌన్ కారణంగా రాత్రి 9 గంటలకు మూసివేయాల్సిన తమ సెల్ ఫోన్ షాపును వీరు మరో పావుగంట పాటు తెరచివుంచడమే, వీరికి శాపమైంది. షాపు తెరచి వుండటాన్ని చూసిన పోలీసులు, తొలుత తండ్రిని తీసుకెళ్లగా, అతని కోసం కుమారుడు స్టేషన్ కు వెళ్లాడు. ఇద్దరినీ రాత్రంతా పోలీసులు హింసించగా, ఆపై ఇద్దరూ ఒకరోజు తేడాలో చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు. కేసులో ఇన్ స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్ స్పెక్టర్లు రఘు గణేశ్, బాలకృష్ణన్ లతో పాటు కానిస్టేబుల్ మురుగన్ లను అరెస్ట్ చేశామని రాష్ట్ర సీఐడీ విభాగం క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. ఈ కేసును 12 స్పెషల్ టీములు అన్ని కోణాల్లో విచారిస్తున్నాయని సీబీసీఐడీ ఐజీ శంకర్ వెల్లడించారు. నిందితులపై తొలుత ఐపీసీ సెక్షన్ 312 కింద కేసు రిజిస్టర్ చేశామన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆపై లాకప్ డెత్ జరిగినట్టు ఒక్కో ఆధారమూ బయటపడుతుంటే, 302 సెక్షన్ కు మార్చారు. త్వరలో కేసును సీబీఐకి అప్పగిస్తారు.