Kevin Mayor: ఇండియాలోని టిక్ టాక్ ఉద్యోగులకు సీఈఓ కెవిన్ మేయర్ భావోద్వేగ లేఖ!
- ఇంటర్నెట్ ను ప్రజాస్వామ్యబద్ధం చేయడమే లక్ష్యం
- చాలా వరకూ విజయం సాధించాం
- ఎక్కడా నిబంధనలను మీరలేదు
- ఉద్యోగులకు అండగా ఉంటామని లేఖ
చైనా కేంద్రంగా నడుస్తున్న టిక్ టాక్ సంస్థ యాప్ ను భారత్ లో నిషేధించిన నేపథ్యంలో సంస్థ సీఈఓ కెవిన్ మేయర్ ఇక్కడి ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. జూన్ 15న సరిహద్దుల్లో ఇండియా, చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ 21 మంది భారత సైనికులను బలి తీసుకున్న నేపథ్యంలో మొత్తం 59 చైనా యాప్ లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.
"టిక్ టాక్ లో ఇంటర్నెట్ ను ప్రజాస్వామ్యబద్ధం చేయాలన్న లక్ష్యంతో మాత్రమే మనం పని చేశాం. ఆ దిశగా చాలా వరకూ విజయం సాధించాం కూడా. ఇదే సమయంలో ఇప్పుడు ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో అందరు వాటాదారులతో చర్చిస్తున్నాం. ఇండియాలోని చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలను అన్నీ పాటిస్తూనే ఉన్నాం.
ఈ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎటువంటి చర్యలనూ మనం చేయలేదు. గోప్యతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాం. 2018 నుంచి ఇండియాలో మనం ఎంతో కష్టపడ్డాం. మన యూజర్ల సంఖ్యను 20 కోట్లకు చేర్చేందుకు ఎంతో శ్రమించాం. ఈ పయనంలో ప్రతి ఒక్కరూ కృషి చేశారు. మన ఉద్యోగులే సంస్థకు బలం. వారి బాగోగులు సంస్థకు ప్రాధాన్యం. ఇక్కడ ఉన్న 2 వేల మంది ఉద్యోగుల మేలు కోసం అన్ని చర్యలూ తీసుకుంటాం" అంటూ 'ఏ మెసేజ్ టూ అవర్ ఎంప్లాయిస్ ఇన్ ఇండియా' అన్న టైటిల్ తో ఆయన లేఖ రాశారు.
"టిక్ టాక్ ప్లాట్ ఫామ్ ను విజయవంతం చేసేందుకు మీరెంతో శ్రమించారు. కళాకారులు, కవులు, విద్యావేత్తలు, సాధారణ ప్రజలు, విద్యార్థులు ఎందరో మన యాప్ తో వారి జీవన విధానాన్ని మార్చుకున్నారు. వారి నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి మనం చేర్చాం. వారి వీడియోలు ఎంతో మందికి వినోదాన్ని పంచాయి. సినిమా తారల నుంచి స్పర్ట్స్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ టిక్ టాక్ ను వినియోగిస్తున్నారు. కేవలం నగరాల్లో మాత్రమే కాకుండా, చిన్న చిన్న పల్లెలకు సైతం టిక్ టాక్ విస్తరించిందంటే, అందుకు ప్రతి ఉద్యోగీ బాధ్యుడే. మీరంతా మీమీ కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పుడు నెలకొన్న సమస్యలు త్వరలోనే సమసిపోతాయని భావిస్తున్నాను" అని కెవిన్ మేయర్ వ్యాఖ్యానించారు.