Chittoor District: వస్తువులు కొని, డబ్బులు చెల్లించినట్టు నకిలీ మెసేజ్ లు.. మదనపల్లెలో 9 మంది ముఠా అరెస్ట్
- డింగ్ టోన్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న యువతీయువకులు
- ఫోన్లు, దుస్తులు కొనుగోలు చేసి డబ్బులు పంపినట్టు మెసేజ్
- పోలీసులకు ఫిర్యాదుతో మోసం వెలుగులోకి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో 9 మందితో కూడిన యువతి, యువకుల బృందం సరికొత్త మోసానికి తెరతీసింది. వ్యాపారుల నుంచి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్టు నకిలీ మెసేజ్‌లు పంపి పలువురు వ్యాపారులను నిలువునా మోసం చేశారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత చెక్ చేసుకుంటే డబ్బులు లేకపోవడంతో షాక్‌కు గురైన వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఓబుల్‌రెడ్డిగారి పల్లెకు చెందిన అఖిల్ (23), పృథ్వీ (19), పుంగనూరు మండలం బోడేవారిపల్లెకు చెందిన భరత్‌కుమార్ (19), పీఅండ్‌టీ కాలనీకి చెందిన హరీశ్ (22), దిగువ కురవంకకు చెందిన అజయ్‌కుమార్ (22), కురవంకకు చెందిన సాయిచరణ్ (22), వికాస్ (21), చౌడేపల్లి మండలంలోని అప్పినపల్లెకు చెందిన ఎం.చిరంజీవి (22), గురికాయల కొత్తూరుకు చెందిన చిన్నారెడ్డి (22)తోపాటు మరో యువతి కలిసి ఓ టీంగా ఏర్పడి ఈ నయా మోసానికి పాల్పడ్డారు.
జల్సాలకు అలవాటు పడిన వీరు డింగ్‌టోన్ యాప్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మదనపల్లెలో ఆరుగురు వ్యాపారులను ఈ యాప్ ద్వారా బోల్తా కొట్టించారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, దుస్తులు, బేకరీ వస్తువులు కొని, ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లిస్తున్నట్టు చెప్పేవారు. అయితే, డింగ్‌టోన్ నకిలీ యాప్ ద్వారా డబ్బులు జమ అయినట్టు నకిలీ మెసేజ్‌లు సృష్టించి పంపేవారు.
ఆ తర్వాత మోసాన్ని గ్రహించిన వ్యాపారుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం బయటపడింది. డింగ్‌టోన్ యాప్ ద్వారా వీరంతా నకిలీ మెసేజ్‌లు పంపినట్టు గుర్తించిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 8 స్మార్ట్‌ఫోన్లు, బ్యాటరీలు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఫేస్‌బుక్ ద్వారా కూడా మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.