India: డ్రాగన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు భారత్ ప్రయత్నం.. చైనా మీడియా ఆక్రోశం
- సరిహద్దుల్లో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలు
- వాణిజ్య సంబంధాలపై ప్రభావం
- చైనాతో వాణిజ్య సంబంధాలపై భారత్ కఠినవైఖరి
భారతదేశ శాంతస్వభావం గురించి ప్రపంచదేశాలకు బాగా తెలుసు. అందుకే అనేక ప్రపంచ దేశాల గ్రూపుల్లో భారత్ కు సముచిత స్థానం ఉంటుంది. కానీ ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుందుడుకు చర్యలు, ఘర్షణలతో భారత్ కటువుగా మారింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక మోహరింపులే కాదు, చాణక్య నీతి తరహాలో శత్రువు ఆర్థిక బలాన్ని దెబ్బతీసేందుకు వాణిజ్యపరమైన మార్గంలోనూ ఆంక్షలకు తెరలేపింది. ఇప్పటిదాకా అమెరికాతోనే వాణిజ్యపోరాటం చేస్తున్న చైనాను భారత్ చర్యలు మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి.
చైనా వ్యాపారానికి ప్రధాన విపణి భారతదేశమే. దీన్ని దృష్టిలో ఉంచుకున్న భారత్... చైనా తయారీ వస్తువులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి అక్కడి ప్రజల్లో జాతీయవాదం బాగా సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇదివరకులా భారత మార్కెట్లో తన వస్తువులను అమ్ముకోవడం చైనాకు ఏమంత సులభం కాదు. ఈ అంశాలను ప్రస్తావించింది ఎవరో కాదు, చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్. సరిహద్దుల్లో ఘర్షణల అనంతరం భారత్ లో జాతీయవాదం ఉప్పొంగిందని, అది చైనా వ్యతిరేక భావనగా బలపడిందని ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఇది క్రమంగా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపేంతగా విస్తరించిందని వివరించింది.
"భారత్ లో చైనా పెట్టుబడిదారులకు ఇది నిజంగా గడ్డుకాలమే. భారత ప్రజల్లో జాతీయవాదం ఉప్పొంగుతున్న నేపథ్యంలో చైనా వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంటే ఎంతో రిస్క్ తీసుకోవడమే" అంటూ గ్లోబల్ టైమ్స్ ఆందోళన వచనాలు పలికింది. "సరిహద్దు ఉద్రిక్తతలు భారత ప్రజలను, నిర్దిష్ట రాజకీయనాయకులను, మీడియాను బాగా ప్రభావితం చేశాయి. చైనా వస్తువులను నిషేధించాలన్న ప్రచార ఉద్యమం రూపుదాల్చింది. దానికితోడు ఇప్పటికే జూన్ 22 నుంచి భారత్ లోని అన్ని పోర్టుల్లో చైనా సరకు రవాణాపై అదనపు కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామంతో చైనా ఎగుమతుల రంగానికి నష్టం తప్పదు" అంటూ గ్లోబల్ టైమ్స్ వాపోయింది.
అంతేకాదు, సరిహద్దుల్లో కమాండర్ల స్థాయిలో సైనిక చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తుండడంతో ఉద్రిక్తతలు తగ్గి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సహకారం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటుందని గ్లోబల్ టైమ్స్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. భారత్ లో జాతీయవాదం ఎంత పెరిగితే చైనా వ్యాపారం అంత దెబ్బతింటుందన్న అభిప్రాయం గ్లోబల్ టైమ్స్ కథనం ద్వారా అర్థమవుతోంది.