Dwane Bravo: ధోనీపై స్పెషల్ సాంగ్ రూపొందించిన బ్రావో

Bravo makes a special song on MS Dhoni
  • హెలికాప్టర్ పేరిట సాంగ్
  • టీజర్ రిలీజ్ చేసిన బ్రావో
  • జూలై 7న ధోనీ పుట్టినరోజు
  • త్వరలోనే పూర్తి పాట విడుదల చేస్తానన్న బ్రావో
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో తన కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసం ప్రత్యేక గీతం రూపొందించాడు. హెలికాప్టర్ పేరిట రూపొందించిన ఈ పాట టీజర్ ను బ్రావో తాజాగా రిలీజ్ చేశాడు. జూలై 7న ధోనీ పుట్టినరోజు వస్తోందని, త్వరలోనే పూర్తి పాట విడుదల చేస్తానని బ్రావో వెల్లడించాడు. ధోనీ ఘనతలను కీర్తిస్తూ బ్రావో తనదైన శైలిలో ఈ పాటను ఆలపించాడు.

ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఎన్నో సీజన్లు ఆడిన బ్రావో, ధోనీ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. గతంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు బ్రావో తన ఇంటికి ధోనీ తదితరులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. ధోనీ కొట్టే హెలికాప్టర్ షాట్ కు బ్రావో వీరాభిమాని.

అన్నింటికి మించి ఐపీఎల్ లో బ్రావో తన అద్భుత బౌలింగ్ తో ధోనీకిష్టమైన బౌలర్ గా మారాడు. అంతేకాదు, కీలక సమయాల్లో పవర్ హిట్టింగ్ తో బంతిని స్టాండ్స్ లోకి పంపుతూ జట్టుకి అవసరమైన పరుగులు కూడా సాధించేవాడు. తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో ధోనీ మనసును విపరీతంగా చూరగొన్నాడు.

బ్రావో క్రికెటర్ మాత్రమే కాదు, సింగర్ కూడా. బ్రావో పాడిన 'చాంపియన్స్', 'వుయ్ ఆర్ ద కింగ్స్', 'ల్యాండ్ ఆఫ్ చాంపియన్స్', 'కరీబియన్ డ్రీమ్' అనే గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
Dwane Bravo
MS Dhoni
Song
Helicopter
Teaser
Cricket

More Telugu News