East Godavari District: పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ వచ్చిందన్న అధికారులు.. బెంబేలెత్తిన యువకుడు!

Man tested corona positive without taking samples
  • తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఘటన
  • పరీక్షలు చేయకుండా తిప్పి పంపిన సిబ్బంది
  • ఇంటికొచ్చి వైరస్ సోకిందని చెప్పిన వైనం
కరోనా పరీక్ష చేయించుకుంటే నెగటివో, పాజిటివో ఏదో ఒక ఫలితం వస్తుంది. కానీ, ఎటువంటి పరీక్ష చేయించుకోకుండానే ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు రిపోర్టులు వచ్చాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఇదే జరిగింది. తనకు కరోనా సోకినట్టు అధికారుల నుంచి ఫోన్ రావడంతో బెంబేలెత్తిన యువకుడు (28).. అసలు తాను పరీక్షలే చేయించుకోలేదంటూ అధికారులకు మొరపెట్టుకున్నాడు.

బాధిత యువకుడు చెప్పిన దాని ప్రకారం.. జ్వరంగా ఉండడంతో కరోనా పరీక్షల కోసం ఈ నెల 25న యువకుడు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. రోజంతా అక్కడ వేచి చూసినప్పటికీ అధికారులు పరీక్షలు చేయలేదు సరికదా, వివరాలు తీసుకుని పరీక్షలు ఎప్పుడు చేసేది ఫోన్ చేసి చెబుతామని, ఇక మీరు వెళ్లొచ్చంటూ అక్కడి నుంచి పంపించి వేశారు.

తాజాగా, శనివారం యువకుడి ఇంటికి చేరుకున్న వైద్య సిబ్బంది మొన్న జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని చెప్పడంతో విస్తుపోవడం యువకుడి వంతైంది. పరీక్షలే చేయించుకోని తనకు పాజిటివ్ రావడం ఏంటని వారిని ప్రశ్నించాడు. అంతేకాదు, ఆ వెంటనే వేట్లపాలెం పీహెచ్‌సీకి చేరుకుని అక్కడి వైద్యాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. స్పందించిన వైద్యాధికారిణి ధనలక్ష్మి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
East Godavari District
Samarlakota
Corona Virus
Positive

More Telugu News