BJP: పేకాట ఆడుతూ దొరికిపోయిన కార్యకర్తను విడిపించానన్న బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ.. కాంగ్రెస్ నేతల విమర్శలు!
- దుమారం రేపుతున్న వ్యాఖ్యలు
- ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- బీజేపీ విధానం ఇదేనా? అంటూ విరుచుకుపడిన కాంగ్రెస్
రాత్రివేళ పేకాట ఆడుతూ పట్టుబడిన కార్యకర్తను పోలీసులకు ఫోన్ చేసి విడిపించానంటూ మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ విధానం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బీజేపీ కార్యకర్తల సమావేశంలో విజయవర్గీయ మాట్లాడుతూ, ఓ రోజు అర్ధరాత్రి 2 గంటలకు మన బీజేపీ కార్యకర్త నుంచి ఫోన్ వచ్చిందని, పేకాట ఆడుతుంటే పోలీసులు తనను పట్టుకున్నారని, విడిపించాలని కోరాడని పేర్కొన్నారు. తాను వెంటనే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విడిపించానని చెప్పుకొచ్చారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల వెన్నంటే ఉంటుందని చెప్పేందుకు ఇది ఉదాహరణ అని అన్నారు. కైలాశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
కైలాశ్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఇదేనా బీజేపీ విధానం?’ అంటూ దుమ్మెత్తి పోశారు. ‘ఇలాంటి ఆలోచనలతోనేనా మీరు నవభారత్ నిర్మించేది?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘బాధ్యతాయుతమైన మీ నాయకులు పేకాట ఆడి అరెస్ట్ అయిన కార్యకర్తను విడిపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సమాజానికి మీరిచ్చే సందేశం ఇదేనా?’’ అని దుమ్మెత్తి పోశారు.