Sushant Singh: సుశాంత్ ఆత్మహత్య కేసులో షానూ శర్మను విచారించిన పోలీసులు!

PoliceQuiz Shanoo Sharma in Sushant Sucide Case

  • యష్ రాజ్ ఫిల్మ్స్ లో కాస్టింగ్ డైరెక్టర్ గా ఉన్న షానూ
  • బాంద్రా పోలీస్ స్టేషన్ కు పిలిపించిన అధికారులు
  • ఇండస్ట్రీ నుంచి ఒత్తిళ్లపై విచారణ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక ఇండస్ట్రీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయా? అన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు, యష్ రాజ్ ఫిల్మ్స్ లో కాస్టింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న షానూ శర్మను విచారించారు. రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్, వాణీ కపూర్ వంటి వారిలోని టాలెంట్ ను గుర్తించిన ఆమె, యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాల్లో అవకాశాలు ఇప్పించి, వారు ఫేమస్ అయ్యేందుకు సహకరించారు.

ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా, పోస్టుమార్టం నివేదికలో కూడా, ఆయనే స్వయంగా మెడకు ఉరి బిగించుకున్నారని, మరెవరి ప్రమేయమూ లేదని తేల్చారు. అయితే, బాలీవుడ్ లోని కొందరు పెద్దలు సుశాంత్ కు అవకాశాలు లేకుండా చేశారని, ఈ కారణంతోనే డిప్రెషన్ లో కూరుకుపోయి సుశాంత్ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారంటూ, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసును క్లోజ్ చేయకుండా విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మను బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారించామని ముంబై డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. వివిధ నిర్మాణ సంస్థలకు చెందిన మరికొందరిని కూడా విచారించాలని నిర్ణయించామని, వారిని రాబోయే రోజుల్లో పిలిపించి మాట్లాడతామని తెలిపారు.

కాగా, యష్ రాజ్ ఫిల్మ్స్ లో సుశాంత్ నటిస్తున్న వేళ, షానూ అతనితో కలిసి 'శుద్ధ దేశీ రొమాన్స్', 'డిటెక్టివ్ బ్యోమ్ కేశ్ బాక్ షై' చిత్రాలకు పనిచేశారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత, పోలీసుల ఆదేశాలతో సుశాంత్ సంతకాలు చేసిన కాంట్రాక్టు పేపర్ల కాపీలను యష్ రాజ్ ఫిల్మ్స్ స్వాధీనం చేసింది. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకూ 24 మందిని ప్రశ్నించారు.

Sushant Singh
Shanoo Sharma
Police
Enquiry
Yash Raj Films
  • Loading...

More Telugu News