Corona Virus: కరోనా వైరస్‌ను మొట్టమొదటి సారి గుర్తించింది స్పెయిన్‌లో: పరిశోధకులు !
- గత ఏడాది స్పెయిన్‌లో లభ్యమైన మురుగునీటిలో కొవిడ్-19
- వివిధ నగరాల నుంచి మురుగునీటి నమూనాల సేకరణ
- 2018 జనవరి- 2019 డిసెంబరు మధ్య సేకరణ
- వీటిల్లోనే వైరస్‌కు సంబంధించిన జన్యు పదార్థం
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని ప్రపంచ వ్యాప్తంగా అందరూ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బార్సిలోనా వర్సిటీ పరిశోధకులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ఆ వైరస్‌ను మొట్టమొదటి సారి గుర్తించింది స్పెయిన్‌లోనని అంటున్నారు.
ఓ పరిశోధన ఫలితంగా తమకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. గత ఏడాది మార్చి 12న స్పెయిన్‌లో లభ్యమైన మురుగునీటిలో కొవిడ్-19ను కనుగొన్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై గత ఏడాది డిసెంబర్‌లో డబ్ల్యూహెచ్‌వోకు చైనా వివరాలు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే, స్పెయిన్ పరిశోధకులు అక్కడి వివిధ నగరాల నుంచి మురుగునీటి నమూనాలను 2018 జనవరి- 2019 డిసెంబరు మధ్య వేర్వేరు తేదీల్లో సేకరించారు. వీటిల్లోనే వైరస్‌కు సంబంధించిన జన్యు పదార్థాన్ని గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు.
మురుగు నీటిలో ఈ శాంపిల్‌ను గత ఏడాది మార్చి 12నే సేకరించినట్లు పరిశోధకులు వివరించారు. ఈ పరిశోధనపై ఇంకా సమీక్ష జరగలేదు. మరిన్ని నమూనాలు సేకరించి పరిశోధనలు మరింత విస్తృతంగా కొనసాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.