Murder: తమిళనాడులో రూ. 500 కోట్లు ముంచేసి, హైదరాబాద్ లో తలదాచుకుంటే... దారుణంగా చంపేసిన భార్య!
- మౌలాలీ ప్రాంతంలో అనుమానాస్పద మృతి
- ఎనిమిదేళ్ల తరువాత భర్తను వెతుక్కుంటూ వచ్చిన భార్య
- కలిసి ఉండేందుకు అంగీకరించకపోవడంతో హత్య
హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మరణించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తమ విచారణలో విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో మృతుడి భార్యే నిందితురాలని తేల్చి అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2012లో చెన్నైకి చెందిన ప్రభాకరన్ అలియాస్ క్రిస్టీ (50) అనే వ్యక్తిని పోలీసులు మనీ బ్యాక్ పాలసీ రాకెట్ లో అరెస్ట్ చేశారు. ఓ భారీ స్కామ్ కు తెరతీసిన ప్రభాకరన్, ప్రజల నుంచి దాదాపు రూ. 500 కోట్లు కొట్టేశాడు.
ఈ కేసులో 8 నెలల తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన ప్రభాకరన్, తమిళనాడులో ఉండలేక, హైదరాబాద్ కు వచ్చి, మౌలాలి ప్రాంతానికి చేరుకున్నాడు. ఇదే కేసులో భాగంగా 2013లో అతని భార్య సుకన్యను కూడా తమిళనాడు సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. ఆమె దాదాపు ఐదేళ్లు జైల్లో గడపాల్సి వచ్చింది. వీరికి ముగ్గురు పిల్లలుండగా, వారు ప్రభాకరన్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. 2018లో బెయిల్ పై బయటకు వచ్చిన సుకన్యకు, భర్త ఆచూకీ తెలియరాలేదు.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని తన బంధువుల ఇంటికి పిల్లలతో సహా వచ్చిన ఆమె, అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో ప్రభాకరన్, మౌలాలిలో ఉంటున్నాడని తెలుసుకుని వచ్చింది. అప్పటికే పక్షవాతం బారిన పడిన ప్రభాకరన్, అనుకోకుండా భార్యను చూసి ఆమెతో కలిసి జీవించేందుకు ఇష్టపడలేదు. తిరిగి వెళ్లిపోవాలని గొడవ పెట్టుకున్నాడు, ఈ నెల 23 రాత్రి వేళ, లేవలేని స్థితిలో ఉన్న భర్త ముఖంపై దిండును గట్టిగా అదిమి చంపేసింది.
ఆపై తన భర్త నిద్రలోనే మరణించాడంటూ, ఓ కట్టుకథను సుకన్య అల్లింది. అయితే, స్థానికులకు అనుమానం రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారించగా, తానే ఈ హత్య చేసినట్టు సుకన్య అంగీకరించింది. ప్రస్తుతం ఆమెను రిమాండ్ కు తరలించామని మల్కాజిగిరి పోలీసు అధికారులు వెల్లడించారు.