Rapaka Vara Prasad: పవన్ బయటకువస్తే ఫ్యాన్స్ తో ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే: రాపాక వరప్రసాద్
- వైసీపీ కార్యక్రమాలు బాగున్నాయని వ్యాఖ్యలు
- అందుకే వైసీపీకి మద్దతిస్తున్నట్టు వెల్లడి
- పార్టీ నిర్మాణం బాధ్యత పవన్ పైనే ఉందన్న రాపాక
ఓ మీడియా చానల్ తో ఇంటర్వ్యూలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానని, అయితే వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు బాగుండడంతో వారికి మద్దతు ఇస్తున్నానని వెల్లడించారు. మొదట్లో తాను వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించానని, ఆ పార్టీ టికెట్ దక్కలేదని తెలిపారు. అనంతరం, తనను జనసేన పార్టీ సంప్రదించిందని, దాంతో జనసేన తరఫున బరిలో దిగానని రాపాక వివరించారు.
అయితే, ఇప్పుడు జనసేన కార్యకలాపాలు జరగడంలేదని, ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదని, తనను కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. తనను తమ పార్టీలోకి రావాలని వైసీపీ ఎప్పుడూ అడగలేదని, మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ తమకే ఓటు వేయాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. తాను మాత్రం 'అయోధ్య' రామిరెడ్డికి ఓటేశానని వెల్లడించారు.
ఇక, జనసేన గురించి చెబుతూ, అసలు పార్టీ నిర్మాణమే జరగలేదని, అధ్యక్షుడు మాత్రమే ఉన్నారని, గ్రామస్థాయిలో కమిటీలు ఇప్పటికీ ఏర్పడలేదని తెలిపారు. తాను ఎన్నిసార్లు చెప్పినా పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీకి, తనకు దూరం పెరగడానికి కారణాలను కూడా రాపాక వివరించారు. "దిండి సమావేశాలకు నన్ను ఎవరూ పిలవలేదు. నన్ను కూడా పిలవొచ్చు కదా అని నాదెండ్ల మనోహర్ ను అడిగితే నీకు బొట్టు పెట్టి, చీర కట్టి పిలవలేం అన్నారు. మీరే రావాలి, మేమేం పిలుస్తాం అన్నారు. ఆ సమయంలో కుర్చీ కూడా నేనే తెచ్చుకుని వేసుకున్నాను. నాదెండ్ల మనోహర్ కు నచ్చితే పక్కనబెట్టుకుంటారు. లేకపోతే దూరంగా ఉంచుతారు. పార్టీ తప్పుడు మార్గంలో వెళ్లడానికి నాదెండ్లనే కారణమని పార్టీలో ఉన్నవాళ్లే భావిస్తున్నారు.
జనసేన పార్టీకి ఓ నిర్మాణం ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. పార్టీ నిర్మాణం అధ్యక్షుడి బాధ్యత. ఎన్నికల్లో పని చేసేటప్పుడు గ్రామ కమిటీలు ఎంతో కీలకం అని పవన్ కు చెప్పినా ఫలితం కనిపించలేదు. ఎన్నికల్లో నేను సొంతగా గ్రామ కమిటీలు వేసుకోవడం వల్లే గెలిచాను. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ఏం మాట్లాడాలో నేను పవన్ ను ఎప్పుడూ అడగలేదు. వాళ్లకు నాకూ సంబంధాలు లేవు. పీఏకి ఫోన్ చేసినా ఎత్తే పరిస్థితి లేదు.
పార్టీ మరింత బలోపేతం కావాలంటే పవన్ కూడా జనాల్లో తిరగాలి. పవన్ బయటికొచ్చినప్పుడు ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అయినా, ఒకట్రెండు సార్లు తిరిగితే పరిస్థితి మామూలైపోతుంది. చిరంజీవి ఎంతో కలివిడిగా తిరిగాడు కదా. జగన్ విజయవంతం కావడానికి కారణం అదే. ఆయన బయటికొస్తే ఎవరికైనా సెల్ఫీ ఇస్తారు. తానే ఫోన్ తీసుకుని సెల్ఫీ తీస్తారు. ఇలాంటివన్నీ చేయగలిగితేనే రాజకీయాల్లోకి రావాలి. జనాలకు దగ్గరైతేనే ఫలితం ఉంటుంది. సోషల్ మీడియాలో నాపై విపరీతంగా ట్రోలింగ్ ఉంటుంది. అయినా నేను దేనికీ బదులివ్వను. వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.