Kendra Jalshakti Shakha: పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు: కేంద్ర జలశక్తి శాఖ క్లీన్ చిట్
- పోలవరంపై నిగ్గు తేల్చాలంటూ ఓ సామాజికవేత్త ఫిర్యాదు
- అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవన్న కేంద్రం
- అప్పటి ప్రభుత్వం తమకు పూర్తి సమాచారం అందించిందని వెల్లడి
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే పెంటపాటి పుల్లారావు అనే సామాజికవేత్త కూడా పోలవరంపై నిగ్గు తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనడానికి ఆధారాల్లేవని వెల్లడించింది. ఈ మేరకు పెంటపాటి పుల్లారావుకు లిఖితపూర్వకంగా బదులిచ్చింది.
అవినీతి జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే విచారణ అవసరం లేదని భావిస్తున్నామని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పునరావాసం, ప్రాజెక్టు అనుబంధ పనుల గురించి చెబుతూ, గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందిస్తూ ప్రాజెక్టు పనులు కొనసాగించిందని వెల్లడించింది. పోలవరం అంచనాల వ్యయానికి సంబంధించి సీడబ్ల్యూసీ సలహా సంఘం కూడా అప్రూవల్ ఇచ్చిందని, దాంట్లో కూడా విచారణ జరపాల్సినంత సమస్యలు ఏమీ లేవని తెలిపింది.
పునరావాసం నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను తరలించే యత్నంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పందిస్తూ, 2,500 మందికి పైగా ప్రజలను 8 ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని, అన్నిటికీ సరైన అనుమతులు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ వివరించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపైనా పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేయగా, ఇది జాతీయ ప్రాజెక్టు అయినందున, అన్ని అనుమతులు ఉంటేనే తాము ఖర్చులను రీయింబర్స్ మెంట్ చేస్తామని, పర్యావరణ అనుమతుల పరంగా ఎలాంటి లోపాలు జరగలేదని తాము గుర్తించిన తర్వాతే రీయింబర్స్ మెంట్ చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఏదేమైనా కేంద్ర జలశక్తి శాఖ స్పందన టీడీపీకి ఎంతో బలాన్నిస్తుందనడంలో సందేహంలేదు. పోలవరం విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను కేంద్రం చెప్పిన జవాబుతో తిప్పికొట్టే అవకాశం దక్కింది.