China: గాల్వన్ లోయలో పరిస్థితులపై తమ దేశ తీరుపై చైనీయుల విమర్శలు
- చైనా ప్రభుత్వానికి సొంత ప్రజల నుంచి అసమ్మతి సెగ
- సెక్‌ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సర్వేలో వెల్లడి
- ఆన్‌లైన్ సంభాషణల్లో చైనీయుల అసంతృప్తి
- 75 వేల మంది పోస్టులను విశ్లేషించి పరిశోధన
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంత ప్రజల నుంచి చైనా ప్రభుత్వానికి అసమ్మతి సెగ తగులుతోంది. గాల్వన్ ఘర్షణ గురించి నిజాలు కప్పిపెడుతూ చైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు తమ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సెక్‌ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చైనీయులు చేసుకుంటున్న ఆన్‌లైన్ సంభాషణల్లో తమ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 75 వేల మంది సోషల్ మీడియాలో చేసిన పోస్టులను విశ్లేషించి ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించారు.
చైనా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కొన్ని వ్యూహాత్మక సంస్థల్లోని ఉద్యోగులు కూడా గాల్వన్ లోయ విషయంలో తమ దేశం వ్యవహరించిన తీరుపై విమర్శలు చేస్తుండడం గమనార్హం. ఇతర దేశాల్లోని చైనీయులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లోనూ చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోందని తేలింది.