Undavalli Arun Kumar: అధిక ద‌ర‌ల‌కు భూములు కొని ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వడం ఏమిటి?: జగన్ సర్కారుపై ఉండవల్లి తీవ్ర విమర్శలు

Undavalli Arun Kumar comments on ycp government
  • ఇళ్ల స్థలాల కోసం కొన్న భూములపై విచారణ జరిపించాలి
  • ఇసుక విధానంపై కూడా సరైన ముందస్తు ప్రణాళిక లేదు
  • ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం క్షీణించిపోయింది 
  • జడ్జిలపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు తాను ఓ లేఖ రాశానని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఇళ్ల స్థలాల కోసం కొన్న ఆవ భూములపై విచారణ జరిపించాలని తాను సీఎంను కోరినట్లు చెప్పారు.

వాటిని అధిక ధర పెట్టి కొనుగోలు చేశారని, వాటికి ఇంత పెద్ద మొత్తంలో ధర ఉండదని ఉండవల్లి తెలిపారు. అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన జగన్ మరి భూముల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. ఇది ఏపీ ప్రభుత్వ అసమర్థత అని, అధిక ద‌ర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

కాగా, ఏపీ సర్కారుకి ఇసుక విధానంపై కూడా సరైన ముందస్తు ప్రణాళిక లేదని ఉండవల్లి అన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం క్షీణించిపోయిందని తెలిపారు. ఇసుక కష్టాలను ఇప్పటికీ తీర్చలేకపోతున్నారని ఆయన చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అందుబాటులో లేదని, ఇసుక విధానంలో అవినీతి జరగడం మాత్రమే కాకుండా కూలీలకు ఉపాధి లేకుండా పోతోందని తెలిపారు.

అలాగే, మద్యం విధానంలో పలు విషయాలను త్వరలోనే తేల్చి చెబుతానని ఉండవల్లి అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల కంటే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ధరలు పెంచితే తాగేవారు తగ్గుతారనుకోవడం భ్రమేనని చెప్పారు.

అలాగే, రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ ప్రతీకార చర్యలకు పాల్పడడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ఎలక్షన్ కమిషన్‌ విషయంలో వచ్చిన తీర్పుల విషయంలో జడ్జిలపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని ఆయన చెప్పారు. జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
Undavalli Arun Kumar
Andhra Pradesh
YSRCP

More Telugu News