India: భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఇరువైపులా భారీగా మోహరింపు
- ఇరువైపులా భారీగా మోహరిస్తున్న సైన్యం
- కీలక ప్రాంతాల్లో ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తున్న ఇరు దేశాల సైన్యం
- లోయలో ఉద్విగ్న పరిస్థితులు
వాస్తవాధీన రేఖ వద్ద మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనా బలగాలు భారీగా మోహరించాయి. ఇరువైపులా దాదాపు వెయ్యిమందికిపైగా సైనికులను మోహరించినట్టు తెలుస్తోంది. గాల్వన్‌లోని పెట్రోలింగ్ పాయింట్-14, పాంగాంగ్ టీఎస్ఓ వద్ద ఇరు దేశాల సైనికులు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుండడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు, కీలక ప్రాంతాల్లో ఇరు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. అయితే, ఈ నెల 15 తర్వాత గాల్వన్ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ ఇరు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.