India: చైనా బలగాలను వెనక్కి పంపేందుకు సైనిక చర్య... పరిశీలిస్తున్న కేంద్రం
- ఇప్పటికీ వాస్తవాధీన రేఖ సమీపంలోనే ఉన్న చైనా బలగాలు
- గాల్వన్ లోయలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- కొన్ని మీటర్ల దూరంలోనే భారత్, చైనా బలగాలు
గాల్వన్ లోయ వద్ద 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనా పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. చైనా దురాక్రమణపై దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ సమీపంలోని పాంగాంగ్ సరస్సు, ఫింగర్-4 ప్రాంతాల్లో తిష్టవేసినట్టు గుర్తించారు. చైనా బలగాలను వెనక్కి పంపేందుకు సరిహద్దుల్లో సైనిక చర్య చేపట్టే దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో అన్ని సెక్టార్లలో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించాలని భావిస్తున్నారు.
చైనా మెడలు వంచడానికి ఇదే సరైన సమయమని నిపుణులు పేర్కొంటున్న తరుణంలో, గల్వాన్ లోయ అంశంపై ఆ దేశాన్ని కాళ్ల బేరానికి తెచ్చేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా... ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం సైన్యానికి కట్టబెడుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని మీటర్ల దూరంలోనే ఇరుదేశాల బలగాలు మోహరించి ఉన్నాయని తెలుస్తోంది. అటు గస్తీ పోస్టు-14, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనికులు బలప్రదర్శనకు దిగడంతోపాటు ఫిరంగులు, యుద్ధ ట్యాంకులు పెద్ద సంఖ్యలో మోహరించినట్టు తెలుస్తోంది.