Ram Gopal Varma: అమృత వ్యాఖ్యలకు సమాధానం చెబుతా: రామ్ గోపాల్ వర్మ

Ramgopal Varma Answer to Amrutha

  • 'మర్డర్' పోస్టర్ విడుదలతో కలకలం సృష్టించిన వర్మ
  • చాలా ఘాటుగా స్పందించిన అమృత
  • ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో వర్మ ఆన్సర్

మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేపిన మారుతీరావు, ఆయన కుమార్తె అమృతల వాస్తవ సంఘటనల ఆధారంగా తాను 'మర్డర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నానంటూ రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, దానిపై అమృత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

"వర్మ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూడగానే నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తోంది. నేనేమీ వర్మపై కేసు వేయడం లేదు. ఎందుకంటే ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో అతడు కూడా ఒకడు" అంటూ అమృత మండిపడగా, ఇప్పుడు వర్మ కూడా స్పందించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, "అమృత చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. తాను, తన తండ్రి కథతో 'మర్డర్' పేరిట నేను సినిమా తీస్తున్నానని తెలుసుకుని, ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. అమృతే రాసిందనుకున్నా లేదా ఓ పనిలేని వాడు రాసినా, నేను 'మర్డర్'లో ఏం చూపించబోతున్నానన్న విషయంలో అనవసరపు ఆందోళనలతో ఉన్న వారి పట్ల స్పందించడం నా విధి అని భావిస్తున్నాను" అని అన్నారు.

ఆ తరువాత "తొలుత ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. 'మర్డర్' పోస్టర్ లో వాస్తవ గాథ ఆధారంగా అని క్లయిమ్ చేశానే తప్ప, ఇదే నిజమైన స్టోరీ అనలేదు. ఈ కథకు మూలం ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. ఇందుకు సంబంధించి పబ్లిక్ డొమైన్ లో ఎంతో సమాచారం ఉంది. ఈ పోస్టర్ తయారీకి స్ఫూర్తిగా నిలిచిన రియల్ ఫోటోలు ఇంటర్నెట్ లో విరివిగా లభ్యమవుతున్నాయి. వీటినేమీ నేను రహస్యంగా తీసుకుని మరొకరి నమ్మకాన్ని వంచించలేదు. 'మర్డర్' కథ ఇదేనని ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా, నా మనసులో ఉన్న ఆలోచన వేరు. అది సినిమా విడుదలైన తరువాత మాత్రమే తెలుస్తుంది. ముందుగానే ఊహించుకునేవారికి పరిపక్వత లేనట్టుగానే భావిస్తాను" అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

దాని తరువాత "ఓ జర్నలిస్ట్ వార్త రాసినా, ఓ విచారణ అధికారి విచారించినా, ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా, అది వారివారి ఆలోచనల మేరకు ఉంటుంది. ఓ ఫిల్మ్ మేకర్ గా 'మర్డర్' విషయంలో నా ఆలోచన నాది. నా స్వీయ ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది. అమృత కామెంట్లే అయినా, మరెవరు రాసినా, నా ఫైనల్ మెసేజ్ ఇదే. ఎంతో బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి వున్నాయి. 'మర్డర్' ఎవరినీ అగౌరవపరచబోదు" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News