Dead Body: గాంధీ ఆసుపత్రిలో మిస్టరీగా మారిన మృతదేహం!

Dead Body in Gandhi Hospital turns into a mystery

  • మే 30న గాంధీలో చేరిన నరేంద్ర సింగ్ అనే వ్యక్తి
  • మరుసటి రోజు తమతో ఫోన్ లో మాట్లాడినట్టు చెబుతున్న కుటుంబీకులు
  • ఓపీ తీసుకున్నాక కనిపించకుండా పోయాడంటున్న డాక్టర్లు

హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి కరోనా చికిత్సకు చిరునామాగా నిలుస్తోంది. అయితే, ఓ మృతదేహం గాంధీ ఆసుపత్రిలో మిస్టరీగా మారింది. ఆసుపత్రికి వచ్చినా కరోనా పరీక్షలు చేయించుకోని వ్యక్తి మృతదేహంగా మార్చురీలో ఉండడం ఎలా సాధ్యమైందో ఎవరికీ అర్థం కావడంలేదు.

నరేంద్ర సింగ్ అనే వ్యక్తి మే 30న గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత రోజు తమతో ఫోన్ లో మాట్లాడాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో ఓపీ తీసుకున్నాక నరేంద్ర సింగ్ కనిపించకుండా పోయాడని డాక్టర్లు వెల్లడించారు. నరేంద్ర సింగ్ కు కరోనా పరీక్షలు జరగలేదని వారు స్పష్టం చేశారు. కానీ ఈ నెల 19న నరేంద్ర సింగ్ మృతదేహాన్ని పోలీసులు మార్చురీలో గుర్తించారు. నిన్న అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అసలు, నరేంద్ర సింగ్ ఎలా చనిపోయాడన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో నరేంద్ర సింగ్ మృతిపై సీఐడీ విచారణ చేయాలంటూ బంధువులు, ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంగళ్ హాట్ సీఐ మాట్లాడుతూ, మే 30న నరేంద్ర సింగ్ గాంధీ ఆసుపత్రికి వెళ్లినట్టు బంధువులు చెబుతున్నారని, కింగ్ కోఠి ఆసుపత్రి నుంచి 108 వాహనంలో నరేంద్ర సింగ్ తో పాటు, భాస్కర్ అనే మరో రోగిని కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని వెల్లడించారు.

గాంధీ ఆసుపత్రిలో భాస్కర్ ను అడ్మిట్ చేసి, నరేంద్ర సింగ్ ను అక్కడి డాక్టర్లకు అప్పగించామని 108 సిబ్బంది చెప్పినట్టు సీఐ తెలిపారు. తన కుమారుడు కనిపించడంలేదంటూ ఈ నెల 6న నరేంద్ర సింగ్ తల్లి ఫిర్యాదు చేసిందని వివరించారు. మే 31న రాత్రి 10 గంటలకు గాంధీ ఆసుపత్రి మార్చురీకి నరేంద్ర సింగ్ మృతదేహాన్ని తీసుకువచ్చినట్టు అక్కడి రికార్డుల్లో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News