Shoaib malik: సానియా మీర్జాను కలిసేందుకు షోయబ్ మాలిక్‌కు పీసీబీ అనుమతి
- ఐదు నెలలుగా కుటుంబానికి దూరమైన షోయబ్
- మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామన్న పీసీబీ
- జులై 24న ఇండియాకు రాక
భార్య సానియా మీర్జాను కలిసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోయబ్ మాలిక్‌కు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో ఉన్న భార్య, కుమారుడిని ఐదు నెలలుగా కలవలేకపోయానని, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కొంత సమయం ఇస్తే భార్యను కలిసొస్తానని షోయబ్ చేసిన అభ్యర్థనను పీసీబీ అంగీకరించింది. షోయబ్ అభ్యర్థనను మానవతా దృక్పథంతో గౌరవించి కుటుంబాన్ని కలిసే అవకాశం కల్పిస్తున్నట్టు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిం ఖాన్ పేర్కొన్నారు. జులై 24న మాలిక్‌ను భారత్ పంపేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో మాట్లాడినట్టు పీసీబీ తెలిపింది.
ఆగస్టు-సెప్టెంబరులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28న పాక్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. డెర్బీషైర్‌లో 14 రోజులపాటు నిర్బంధంలో ఉన్న అనంతరం కోవిడ్ నిబంధనలను అనుసరించి క్రికెట్ ఆడే విధానంపై పాక్ జట్టు శిక్షణ పొందనుంది. అనంతరం బయో సురక్షిత వాతావరణంలో నిబంధనల మేరకు క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.