Narendra Modi: జాతికి యోగా దినోత్సవ సందేశమిచ్చిన నరేంద్ర మోదీ!

Modi Speach on International Yoga Day
  • ప్రాణాయామంతో పెరిగే రోగ నిరోధక శక్తి
  • ప్రతి ఒక్కరూ శ్వాసను అదుపులో ఉంచుకోవాలి
  • ఈ సంవత్సరం యోగా డే డిజిటల్ రూపంలోకి మారింది
  • అందరూ ఇంట్లోనే ఆసనాలు వేయాలి
  • ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
ప్రాణాయామాన్ని నిత్యమూ చేయడం ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతికి సందేశమిచ్చిన ఆయన, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి యోగాసనాలు వేయాలని పిలుపునిచ్చారు.

"కొవిడ్-19 శరీరంలోని రెస్పిరేటరీ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తోంది. ప్రాణాయామంతో మన శరీరపు శక్తి పెరుగుతుంది. శ్వాసను అదుపులో ఉంచుకోవడం, అనులోమ, విలోమ ప్రక్రియల ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. రోజువారీ దినచర్యలో ఈ యోగాసనాన్ని భాగం చేసుకోవాలి. వీటితో పాటు మరెన్నో ఆసనాలు ఉన్నాయి. అవి ఇమ్యూనిటీని, మెటబాలిజాన్ని పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయి" అని అన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన ఎంతో మంది యోగాసనాల ద్వారా లబ్దిని పొందుతున్నారు. ఆసనాలు వేస్తుంటే, వారిలో వైరస్ ను జయించగలమన్న నమ్మకం పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కరోనాపై పోరాటానికి అవసరమైన భౌతిక శక్తిని పొందాలంటే యోగా ఓ మార్గం" అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం డిజిటల్ రూపంలోకి మారిపోయిందని, కుటుంబంతో కలిసి యోగా డే జరుపుకునే అవకాశాన్ని దగ్గర చేసిందని మోదీ వ్యాఖ్యానించారు. భూమిని మరింత ఆరోగ్యవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగాను అలవరచుకోవాలని, తద్వారా మనుషుల్లో మానవత్వం పెరుగుతుందని, ప్రజలను ఏకం చేస్తుందని ఆయన అన్నారు. .

కాగా, ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతూ, 4 లక్షలను దాటేసిన వేళ, ఈ ఉదయం పలువురు నేతలు తమ యోగాసనాలను ఇంట్లోనే వేస్తూ, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోమ్ మంత్రి అమిత్ షా తదితరులు యోగాసనాలు వేశారు.
Narendra Modi
Yoga Day
Pranayam

More Telugu News