Donald Trump: భారత్, చైనాల మధ్య ఏం జరుగుతుందో చూడాలి: డొనాల్డ్ ట్రంప్
- సరిహద్దుల విషయంలో క్లిష్ట పరిస్థితులు
- ఇరు దేశాలతో మాట్లాడుతున్నాం
- సమస్యల పరిష్కారానికి సహకరిస్తామన్న ట్రంప్
ఇండియా, చైనాల మధ్య సరిహద్దుల విషయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొని వున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కరోనా విజృంభణ తరువాత, తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు.
భారత్ తో పాటు చైనాతోనూ చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేసిన ఆయన, రెండు దేశాల మధ్యా చాలా పెద్ద సమస్య ఉందని, వారి మధ్య ఘర్షణ కూడా జరిగిందని అన్నారు. సమస్యలను శాంతియుతంగా అధిగమించాలని, అందుకు అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ఏం జరుగుతుందో చూడాలని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.
డొనాల్డ్ ట్రంప్ ఆది నుంచి ఈ విషయంలో ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నారన్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు పాల్పడుతోందని ఇటీవల ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. కాగా, తన ఎన్నికల ప్రచారాన్ని ఓక్లహామా నుంచి ట్రంప్ ప్రారంభించనున్నారు.