Kottu Sathyanarayana: రఘురామకృష్ణంరాజు ఆర్థిక నేరస్తుడని మాకు ముందు తెలియదు... ఇప్పుడే తెలిసింది: ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
- నరసాపురం ఎంపీ స్థానం పరిధిలో భగ్గుమంటున్న విభేదాలు
- ఎంపీ రఘురామకృష్ణంరాజుకు, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య యుద్ధం
- పక్కా దొంగ అంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కొంతకాలంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీలో వైషమ్యాలు పతాకస్థాయికి చేరాయి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దమ్ముంటే మళ్లీ గెలవాలని ఇటీవలే ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేలందరికీ సవాల్ విసిరారు. ఆపై ఎమ్మెల్యేలు కూడా ప్రతి సవాళ్లు విసరడంతో వాతావరణం మరింత వేడెక్కింది. పార్టీ సీనియర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దీనిపై స్పందిస్తూ, 'సీఎం జగన్ కు ఇలాంటివి నచ్చవు, ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు' అని చెప్పినా, నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలో రభస కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ అంశంపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెట్టించే దుర్మార్గానికి దిగజారాడని మండిపడ్డారు. కార్యకర్తలు సర్వస్వం ఒడ్డి ఎన్నికల్లో గెలిపిస్తే, కనీస విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం ఉన్నప్పుడు వాడుకుని, ఆ తర్వాత వెన్నుపోటు పొడవడం రఘురామకృష్ణంరాజు నైజమని ఆరోపించారు.
రఘురామకృష్ణంరాజు ఓ ఆర్థిక నేరస్తుడన్న విషయం తమకు ముందుగా తెలియదని, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో 420 కేసు నమోదైందని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేశాడని, ఎర్రమంజిల్ లోనూ రెండు 420 కేసులు నమోదయ్యాయని, ఇతడు పక్కా దొంగ అని విమర్శించారు. తనపై కేసుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొని సంతకం చేశాడని, అప్పట్లో తమకు ఆ విషయం తెలియదని చెప్పారు.
రఘురామకృష్ణంరాజు జిల్లాలో అడుగుపెడితే కార్యకర్తలు సహించే స్థితిలో లేరని, అతడి అంతు తేలుస్తారని కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. అతనికి స్థాయి అంటూ ఏమీ లేదని, దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఇష్టం వచ్చినట్టు వాగితే ఎవరూ పట్టించుకోరని అన్నారు. సీఎం జగన్ వల్లే ఎంపీ అయ్యాడని, కానీ దాన్ని నిలబెట్టుకునే అర్హత అతనికి లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు.