Chennai: యజమాని ఔదార్యం.. భార్య పుట్టిన రోజును పురస్కరించుకుని దుకాణాల అద్దె రద్దు!
- 14 దుకాణాల నుంచి రావాల్సిన లక్ష రూపాయల అద్దె రద్దు
- లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న దుకాణదారులను ఆదుకునేందుకేనన్న యజమాని
- ఆనందంలో దుకాణదారులు
తన భార్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ వ్యక్తి తనకు రావాల్సిన దుకాణాల అద్దెను రద్దు చేసి ఔదార్యం చాటుకున్నాడు. చెన్నై మాధవరం నెహ్రూ వీధికి చెందిన ఏలుమలై (58) తన కట్టడంలోని 14 గదులను దుకాణాలకు అద్దెకిచ్చాడు. వాటిలో ఫొటో స్టూడియో, సెలూన్, జిరాక్స్ వంటి దుకాణాలున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇవన్నీ గత రెండు నెలలుగా మూతబడ్డాయి. దీంతో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న దుకాణదారులకు ఏలుమలై శుభవార్త చెప్పాడు.
తన భార్య పరమేశ్వరి (49) పుట్టిన రోజును పురస్కరించుకుని 14 దుకాణాల ఒక నెల అద్దెను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ దుకాణాల నుంచి తనకు నెలకు దాదాపు లక్ష రూపాయలు వస్తుందని ఏలుమలై పేర్కొన్నాడు. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో తనకు ఈ మొత్తం అవసరమే అయినా, తన భార్య పుట్టిన రోజు కావడంతో అద్దెను రద్దు చేసినట్టు చెప్పాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న దుకాణదారులను కొంతైనా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఏలుమలై నిర్ణయంతో దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.