Pawan Kalyan: బతకడమే వారికి కష్టంగా ఉంటే.. పన్నులు ఎలా చెల్లిస్తారు?: పవన్ కల్యాణ్
- లాక్ డౌన్ కారణంగా ట్యాక్సీ యజమానులు నష్టపోయారు
- నిబంధనలు సడలించిన తర్వాత కూడా ఆదాయం లేదు
- రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు ఎత్తేయండి
ట్యాక్సీ యజమానులు లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయారని... వారి వాహనాలకు పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జన జీవనం స్తంభించడంతో, వాహనాలు తిప్పే పరిస్థితి లేదని... లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత కూడా గతంలో మాదిరి ఆదాయం లేదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ట్యాక్సీ యజమానులను రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదని చెప్పారు.
జీవనమే కష్టంగా మారినప్పుడు, పన్నులు ఎలా చెల్లించాలని ట్యాక్సీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో పన్నులు రద్దు చేయాలని... సీట్ల కుదింపు ఉన్నంత కాలం 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్యాక్సీ యజమానులను, వారిపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.