Corona Virus: కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో మైలురాయిని అధిగమించిన ఏపీ!

Very Less Corona Death Rate In AP

  • ఇప్పటివరకూ 6.12 లక్షల మందికి టెస్ట్ లు
  • వారం రోజుల్లోనే లక్ష మందికి పరీక్షలు
  • 1.23 శాతానికి తగ్గిన మరణాల రేటు

కరోనా మహమ్మారిని జయించే దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ 6.12 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వారంలోనే లక్ష టెస్ట్ లను చేసే స్థాయికి చేరింది. జనాభాలో ప్రతి పది లక్షల మందికీ సగటున 11,468 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేసేందుకు కట్టుబడివున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షలకు 58 రోజులు పట్టగా, ఆపై 2 లక్షల పరీక్షలకు 12 రోజులు, 3 లక్షలకు 11 రోజులు, 4 లక్షలకు 10 రోజులు, 5 లక్షలకు 8 రోజులు, 6 లక్షలకు 7 రోజుల సమయం మాత్రమే పట్టింది. ఇదే సమయంలో ఇన్ఫెక్షన్ రేటు 1.22 శాతం ఉండగా, మరణాల రేటు 1.23 శాతంగా ఉంది. రికవరీల సంఖ్య 50.32 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.33 శాతంగా ఉండగా, ఏపీలో మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 92గా ఉంది.

మొత్తం కేసుల సంఖ్య 7,496 కాగా, 5,854 కేసులు రాష్ట్రానివి కాగా, 1,353 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి. కాగా, మరో 289 మంది విదేశాల నుంచి వచ్చి వైరస్ బారిన పడిన వారివని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,632గా ఉందని తెలిపారు. ఇటీవలి ఇంటింటి సర్వేలో భాగంగా వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారిని గుర్తించామని, వారి వైద్య అవసరాలను నిత్యమూ తీర్చేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను నియమించామని, వారిని ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయకుండా చూడటం ద్వారా వైరస్ వ్యాప్తిని, మరణాలను అడ్డుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఒక్కరు కూడా మృతి చెందరాదన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

  • Loading...

More Telugu News