Kanna Lakshminarayana: ప్రధాని మోదీ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేయడంలేదు: కన్నా
- అగ్రకుల పేదలకు మోదీ 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారన్న కన్నా
- రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతోందంటూ అసంతృప్తి
- జగన్ సర్కారుకు ఆదేశాలివ్వాలంటూ గవర్నర్ కు లేఖ
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, అయితే, ప్రధాని నిర్ణయాన్ని ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటికీ ఆమలు చేయడంలేదని ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. అగ్రకులాల పేదలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని కన్నా తన లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో ఈ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది అనేక అవకాశాలు కోల్పోతున్నారని, ఉపాధి పొందలేకపోవడమే కాకుండా, ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారని వివరించారు. ఈ విషయమై ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టే అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ వెంటనే స్పందించి, ఏపీలోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కన్నా విజ్ఞప్తి చేశారు.