Nathuram Soren: ఓ వీరసైనికుడి మరణం గురించి భార్యాబిడ్డలకు ఇంతవరకు తెలియదు!
- సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికుల మృతి
- బీహార్ రెజిమెంట్ కు చెందిన నాథూరామ్ సోరెన్ వీరమరణం
- సోరెన్ మృతి గురించి భార్యకు చెప్పేందుకు భయపడుతున్న కుటుంబీకులు
గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వారిలో బీహార్ రెజిమెంట్ కు చెందిన నాథూరామ్ సోరెన్ కూడా ఉన్నారు. సోరెన్ వయసు 43 సంవత్సరాలు. సైన్యంలో నాయిబ్ సుబేదార్ గా పనిచేస్తున్నారు. సోరెన్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాథూరామ్ స్వస్థలం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా చంపవుడా గ్రామం. నలుగురు అన్నదమ్ముల్లో సోరెన్ పెద్దవాడు. కుటుంబ బాధ్యత అతనిపైనే ఉంది. సోరెన్ సైన్యంలో పనిచేస్తుండగా, ఆయన భార్య చంపవుడా గ్రామానికి సమీపంలోని రాయ్ రంగాపూర్ లో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు.
ఇప్పుడు బాధాకరమైన విషయం ఏమిటంటే... నాథూరామ్ సోరెన్ చనిపోయిన విషయం భార్యాబిడ్డలకు ఇంతవరకు తెలియదు. తెలిస్తే తట్టుకోలేదేమోనని కుటుంబ సభ్యులు వెనుకంజ వేస్తున్నారు. ఆమె ఈ విషయాన్ని విని భరించలేదని అనుకుంటున్నామని, అందుకే భయపడుతున్నామని సోరెన్ సోదురుడు దామన్ తెలిపాడు. గ్రామస్తులు సైతం అసలు విషయం చెప్పలేక కుమిలిపోతున్నారు.