Ummareddy: చాలెంజ్ లు విసురుకోవడం మానండి... పార్టీ ఇలాంటివి సహించదు: రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఉమ్మారెడ్డి స్పందన
- నర్సాపురం వైసీపీలో విభేదాలు
- రఘురామకృష్ణంరాజు అసంతృప్తి గళం
- చాలెంజ్ లు విసురుకున్న నేతలు
- సమస్యలుంటే జగన్ దృష్టికి తీసుకురావాలని ఉమ్మారెడ్డి హితవు
వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మరింత రగులుకుంటోంది. పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీలో దిగుదాం అంటూ రఘురామకృష్ణంరాజు, ఆయన ప్రత్యర్థులు సవాళ్లు విసురుకున్నారు. దీనిపై శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టంవచ్చినట్టు విమర్శలు చేసుకోవడం, చాలెంజ్ లు విసురుకోవడాన్ని వైసీపీ అధిష్ఠానం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని సీఎం జగన్ గట్టిగా చెప్పారని ఉమ్మారెడ్డి వెల్లడించారు. నాయకులకు ఇబ్బందులు ఎదురైతే సీఎం జగన్ దృష్టికి తీసుకురావాలని, నేతలకు అధిష్ఠానం తగిన సమయం కేటాయించడంలేదని చెప్పడం సరికాదని హితవు పలికారు. నర్సాపురంలో నిన్న జరిగిన చాలెంజ్ లు, కౌంటర్ చాలెంజ్ లు మరోసారి జరగరాదని, ఒకవేళ ఇలాంటి విషయాల్లో ప్రెస్ మీట్లు పెట్టాలంటే పార్టీ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. నర్సాపురం ఘటనలను సీఎం జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు.