US Media: తమ సైనికులు చనిపోవడాన్ని చైనా అవమానంగా భావిస్తోంది: అమెరికా మీడియా
- గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా బలగాల ఘర్షణ
- 35 మంది చైనా సైనికులు చనిపోయారంటున్న అమెరికా మీడియా
- ప్రాణనష్టం వివరాలను చైనా దాచిపెడుతోందని వెల్లడి
లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు చనిపోయినట్టు ఆలస్యంగా వెల్లడైంది. దీనిపై అమెరికా మీడియాలో ఆసక్తికర కథనాలు వచ్చాయి. అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఘర్షణల్లో 35 మంది చైనా సైనికులు చనిపోయారని, తమ సైనికులు చనిపోవడాన్ని చైనా అవమానంగా భావిస్తోందని యూఎస్ న్యూస్.కామ్ మీడియా సంస్థ పేర్కొంది. అందుకే మృతుల సంఖ్య వెల్లడించేందుకు విముఖత వ్యక్తం చేస్తోందని తెలిపింది. కాగా, మృతి చెందిన చైనా సైనిక సిబ్బందిలో ఒక సీనియర్ అధికారి కూడా ఉన్నాడని వెల్లడించింది.
ఇక, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చైనా వ్యవహారాల విభాగం నిపుణుడు టేలర్ ఫార్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాకులు, కాల్పులు లేని ఇలాంటి ఘర్షణల్లో తనకు జరిగిన ప్రాణ నష్టం వివరాలను చైనా ఎప్పుడూ వెంటనే బయటపెట్టదని, ఆ వివరాలను కొన్ని దశాబ్దాల తర్వాత వెల్లడిస్తుందని వివరించారు. 1962లో జరిగిన యుద్ధంలో తమ వైపున జరిగిన ప్రాణనష్టం వివరాలను 1994లో వెల్లడించిందని తెలిపారు. ఫ్రీప్రెస్ జర్నల్ కూడా కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. గత 50 ఏళ్లలో భారత్, చైనా మధ్య అనేక ఘర్షణలు జరిగాయని, అయితే చైనా ప్రాణనష్టాలను దాచిపెడుతోందని తన కథనంలో వెల్లడించింది.