Andhra Pradesh: మూడు రాజధానులే... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ గవర్నర్!
- పరిపాలన వికేంద్రీకరణ కీలకం
- మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉంది
- ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్
ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.
కాగా, ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న వైఎస్ జగన్ సర్కారు, మండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించారని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.