Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో.. స్పీకర్, సీఎం కార్యాలయాలు నిషేధిత ప్రాంతాలు!
- రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
- పాస్ లు ఉన్నవారికే అనుమతి
- నిబంధనలు పాటించాలని అధికారుల వినతి
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. అసెంబ్లీ ప్రాంగణంలో వుండే స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యాలయం, అందులోనే ఉండే సీఎం కార్యాలయాలను నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇక్కడికి అనుమతి లేకుండా ఎవరూ రాకూడదని ఆదేశించింది. అసెంబ్లీ సెక్రటేరియట్ జారీ చేసే పాస్ లను కలిగివున్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని, పాస్ లు లేకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన మార్గంలోనే వెళ్లాలని సూచించింది.
కాగా, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు 20వ తేదీ వరకూ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగాన్ని సైతం ప్రత్యక్షంగా కాకుండా, వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తెరపై ప్రసారం చేస్తారని సమాచారం. ఆపై బడ్జెట్, దాని తరువాత 19న రాజ్యసభ ఎన్నికల తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది.