Tollywood: దివ్య భారతి, ప్రత్యూష, ఉదయ్ కిరణ్ నుంచి... సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ!

Many Mistaries Behind Movie Artists Sucides

  • చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు
  • ఎంతో మంది మరణాల వెనుక మిస్టరీ
  • బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేస్తున్న మరణాలు

సినీ వినీలాకాశంలో ఎంతో ఎదగాల్సిన మరో తార రాలిపోయింది. పలు విజయవంతమైన చిత్రాలలో నటించి, మెప్పించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అర్థాంతరంగా తనువు చాలించాడు. తన అభిమానులను తీవ్రమైన దుఃఖసాగరంలో ముంచెత్తి, బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేశాడు. గతంలోనూ వెండితెర వేల్పులుగా ఎదగాల్సిన ఎందరో, చిన్న చిన్న సమస్యలతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి, బలవన్మరణం చెందారు.

టాలీవుడ్ విషయానికి వస్తే, ఎంతో మంది తారల హఠాన్మరణాల వెనుక అసలైన కారణాలు ఇంతవరకూ వెల్లడి కాకపోవడం గమనార్హం. శృంగార తార సిల్క్ స్మిత, అందాల నటి దివ్య భారతి, ఎంతో ఎదుగుతుందని టాలీవుడ్ పెద్దలు నమ్మిన ప్రత్యూష, యువ హీరో ఉదయ్ కిరణ్ తదితరులు ఎందరో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.

తెలుగు సినీ ప్రేక్షకుల్లో, అందునా యువతలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్, 2014, జనవరి 5న బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. కెరీర్ లో సక్సెస్ లు తగ్గడం, ఆర్థిక సమస్యలతో ఆయన 33 ఏళ్లకే తనువు చాలించాడు. ఆయన మృతికి దారితీసిన అసలు కారణాలేంటన్నది ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం.

కథానాయికగా ఒక్కొక్క హిట్ వస్తున్న సమయంలో ప్రత్యూష ఊహించని పరిస్థితుల్లో 20 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ప్రత్యూష, ఓ యువకుడిని ప్రేమించిందని, వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి విషం తాగగా, ప్రత్యూష మరణించిందని, ఆ యువకుడు బతికిపోయాడని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె మరణం పైనా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తన బిడ్డను దారుణంగా హతమార్చారని ఆమె తల్లి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ప్రత్యూష మరణం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీయే.

ఇక, 1990 దశకంలో అందరి చూపునూ తనవైపు తిప్పుకున్న దివ్య భారతి, బాలీవుడ్ కు వెళ్లిన తరువాత పరిస్థితి మారిపోయింది. నాలుగేళ్ల వ్యవధిలోనే 25 సినిమాల్లో నటించి, మెప్పించిన ఆమె, నిర్మాత సాజిద్ ను పెళ్లాడి, ఆపై ఏడాదికే, తన ఫ్లాట్ లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయింది. ఇది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అన్న విషయాలు ఇప్పటికీ బయటకు రాలేదు.


తన 17 సంవత్సరాల కెరీర్ లో సుమారు 400 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత మరణం కూడా మిస్టరీయే. 1996లో ఆమె విషం తాగి మరణించిందని ప్రపంచానికి తెలుసు. అప్పటికి ఆమె వయసు 35 సంవత్సరాలు మాత్రమే. నిర్మాతగా తాను తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడం, మద్యానికి బానిసైపోవడం, నిజ జీవిత ప్రేమలో విఫలం ఆమెను మానసికంగా కృంగదీశాయని సినీ వర్గాలు అంటుంటాయి.
ఒకే చిత్రంతో అపారమైన పాప్యులారిటీ సంపాదించుకున్న కునాల్ సింగ్ ది కూడా ఆత్మహత్యో, హత్యో ఇప్పటికీ తెలియదు. 'ప్రేమికుల రోజు' సినిమాతో యువతలో గుర్తింపు పొందిన కునాల్, 2008, ఫిబ్రవరి 7న బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలే. సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, కునాల్ ఇలా ఎందుకు చేశాడన్నది మిస్టరీ. తన కుమారుడి మృతదేహంపై గాయాలున్నాయని, ఇది ఆత్మహత్య కాదని కునాల్ తల్లిదండ్రులు అప్పట్లో కేసు పెట్టారు కూడా. ఈ కేసు వివాదాస్పదం కావడంతో రంగంలోకి దిగిన సీబీఐ, ఆయనది ఆత్మహత్యేనని తేల్చింది.

ఇక్కడ ప్రస్తావించింది కేవలం నలుగురైదుగురిని మాత్రమే. ఇలా ఎంతో మంది సినీ కళాకారులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించారు. సినిమాల్లో అవకాశాలు రావడం లేదనో, హిట్స్ వచ్చినప్పుడు ఉన్న విలువ, గౌరవం తరువాత దక్కలేదనో, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు, సమయానికి ఓదార్పు లభించక... ఇలా ఎన్నో కారణాలతో సినీ తారల జీవితాలు మధ్యలోనే కొడిగడుతున్నాయి.

  • Loading...

More Telugu News