Vijayawada: విజయవాడ గ్యాంగ్ వార్ కేసు.. సందీప్, పండు గ్యాంగుల నగర బహిష్కరణ
- గొడవకు కారణమైన బిల్డర్లు అరెస్ట్
- ఈ కేసులో ఇప్పటి వరకు 37 మంది అరెస్ట్
- పరారీలో ఉన్న 13 మంది కోసం పోలీసుల గాలింపు
విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు గ్యాంగులను నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు గ్యాంగుల్లో ఉన్న అందరూ నగరం విడిచి వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్‌కు చెందిన 17 మందిని, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండును శనివారం రాత్రి పటమట పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే, పండు, సందీప్ గ్యాంగుల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 37కు పెరిగింది.
మరోవైపు, ఈ రెండు గ్యాంగులకు సంబంధించి పరారీలో ఉన్న మరో 13 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిన్న అదుపులోకి తీసుకున్న పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డిలను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.